దశ మహా విద్యలులో "శ్యామలా విద్య" ఒకటి. ఈదశమహావిద్యలు దేనికదే పరిపూర్ణ విద్యలు. పదివిద్యలుఒక్క అమ్మవారివే. జగన్మాత ధరించిన పది రూపాలు. ఈ విద్యలు ఇహాన్ని, పరాన్ని కూడా ప్రసాదిస్తాయి. వీటిలో దక్షిణాదిలో "శ్రీవిద్య" ప్రాచుర్యంలో ఉంది. దశ మహా విద్యల పేర్లు - కాళీ, తారా, త్రిపుర సుందరి, ఛిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి.
"మాతంగి" మొత్తం పది విద్యలలో ఒక ప్రత్యేకమైన విద్య. ఈ తల్లి పేరు రాజమాతంగి. ఈ మాతకే శ్యామలాదేవి అనిపేరు. 'మాతంగకన్యాం మనసా స్మరామి' అని అమ్మని ధ్యానిస్తారు. శ్రీవిద్య ఎంతటిదో అంతటి ఉపాసన మాతంగి విద్యలో ఉంది. పది మహావిద్యల క్షేత్రం - అస్సాంలో గౌహతి ప్రాంతంలో నున్న "కామాఖ్యా." అందులో మాతంగి మందిరం కూడా ఉంది. ప్రధానంగా కామాఖ్యా అని చెప్పబడుతూ "మహాకామేశ్వరి" స్వరూపం ఉంది. గర్భాలయం లో ప్రధానమైన "యోనిపీఠం" అని ఏది చెప్పబడుతోందో అది సాక్షాత్తు 'బిందుస్వరూపిణి' 'బైందవాసనా', 'అయోనిర్యోనినిలయా'అయిన "మహాకామేశ్వరి లలితా మహా త్రిపుర సుందరి". ఆప్రక్కనే రెండు పీఠాలు ఉంటాయి. అందులో ఒకటి రాజశ్యామల. రెండవది కమలాత్మిక. మిగిలిన ఏడు కూడా బయటి వేర్వేరు చిన్న గుహల్లో ఉంటాయి.
.
Sri Shyamala Devi
భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్సదా |
శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికామ్ ||
అని అమ్మవారిని ధ్యానం చేస్తారు. లలితాదేవికి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు వారాహీదేవి ఉంటారు. సృష్టి చేయాలని అనుకున్న పరమేశ్వరుని సంకల్పశక్తే లలితాదేవి. 'స అకామయత బహుస్యాం ప్రజాయేయ' అని ఉపనిషత్తు చెప్పింది. ఆ కోరిక అనబడే శక్తి పేరు కామేశ్వరి. ఆవిడే మహాకామేశ్వరి. ఈశ్వరసంకల్పం నుండి వచ్చిన ఇచ్ఛాశక్తి - లలితాదేవి, జ్ఞాన శక్తి - శ్యామలాదేవి, క్రియాశక్తి - వారాహీ దేవి. ఈ మూడు కలిపి ఒకే శక్తి రూపాలు. పరిపూర్ణత అక్కడ కనపడుతున్నది.
శ్యామలా దేవిని ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది. ముందు ఆవిడను ఆరాధించాలనే జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం రావాలంటే పూర్వపుణ్య విశేషం ఉండాలి. ఎవరినైతే సరస్వతి, వాగ్దేవి, బ్రాహ్మీ అని పూజిస్తున్నామో ఆ సారస్వత స్వరూపమే శ్యామలాదేవి.
Sri Shyamala Devi Mukha Soundaryam
శ్యామలా దేవి రూపం రెండు చేతులతో వీణ మీటుతూ, మరొక రెండు చేతులతో రెండు చిలుకలు ధరించి ఉంటుంది. చిలుకలు వచ్చి ఆమె ముంజేతి మీద వాలి ఉంటాయి. ఆమె కదంబపూల మాలలను ధరించింది. ఒకవైపు కిరీటం నుండి కొన్ని, చెవులమీంచి కొన్ని వేలాడుతున్నాయి. ఆమె జడ మూలాధారస్థానం నుంచి సహస్రారం వరకూ పడగవిప్పిన పాములా ఉంది. అలాంటి కేశపాశాలపైన ఆతల్లి నెలవంకను ధరించింది. అమ్మవారి కనుబొమ్మలు వంపు తిరిగి అందమైన తీగలా ఉన్నాయి. మన్మధుని యొక్క ధనుస్సుతో సమానంగా ఉంది. ధనుస్సుతో సమానమైన భ్రూలత, వంపు తిరిగి రావడం తో లతలా ఉన్న ఆ కనుబొమలు నడిమి లోంచి పైకి చక్కగా వికసించిన పసుపు, ఎరుపు రంగు కలిగిన కుసుమమా అన్నట్లు లలాటంపై తిలకం ప్రకాశిస్తున్నది. అమ్మవారు ఇంద్రనీలమణి కాంతులతో ఆకుపచ్చని రంగుతోనూ ప్రకాశిస్తున్నది. ముఖం మాత్రం పూర్ణ చంద్రునిలా ఉంది. అమ్మవారి కిరీటంలో అనేక రకాలైన రత్నాలు,ముత్యాలు పొదగబడిన ఉన్నాయి. అమ్మవారి చెవులకి రకరకాల ఆభరణాలు ధరించారు. అమ్మవారి చెక్కిళ్ళకి కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యములు కలిపి 'మకరికా పత్రము' లిఖించారు. (మకరికా పత్రము అనగా ఒక సౌందర్య అలంకారము.) అసలే సహజసుగంధబంధుర అయిన అమ్మవారి శరీరానికి ఈ మకరికా పత్రం యొక్క సౌరభ్యం వల్ల మంచి వాసన రాగానే దానికి ఆకర్షతమై కొన్ని తుమ్మెదలు వచ్చాయి. అలా వచ్చిన తుమ్మెదలు అమ్మవారి ముఖం వద్దకు వచ్చినాదం చేస్తున్నాయి.
ఆ నాదంతో అమ్మవారి వీణా నాదం కలిసి సాగుతోంది. చక్కని ప్రకాశస్వరూపిణియైన తల్లి.
Sri Shyamala Devi Veena Nadam
అమ్మవారికి 'సంగీతమాతృక' అనిపేరు. సంగీతానికి తల్లి అన్నమాట. జగమంతా నాదమయం.
ఆ నాదస్వరూపమే శ్యామల. 'మకరికా'పత్ర లేఖనం కస్తూరాది సుగంధముతో కలిసి ఉంటాయి కనుక ఒక అద్భుతమైన వాసన ఆ ముఖం మీదనుంచి వస్తున్నది. అసలే 'సుగంధబంధుర' అయిన అమ్మవారి శరీరానికి యీ మకరికా పత్రం వాసన వల్ల తుమ్మెదలు ఆకర్షితమై అమ్మ వారి ముఖం వద్ద బాధించ కుండా తిరుగుతున్నాయి. వాటినుంచి ఒక నాదం వస్తోంది. ఆ నాదంతో అమ్మవారి వీణా నాదం కలిసి సాగుతోంది. తుమ్మెదలు చుట్టూ తిరగడం అనేది 'భ్రామరీ విద్య' కు సంకేతం. బ్రామరీ విద్య అంటే నాదవిద్య. ఆ నాదం ఆవిడ వీణ నుంచి రావడమే కాకుండా ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఆ నాదంతో ఎక్కడా శ్రుతి, లయ తప్పకుండా వీణా నాదం వస్తోంది. చక్కని స్వరశక్తి స్వరూపిణి యైన తల్లి శ్యామలా దేవి.
Sri Shyamala Devi Soundaryam
అమ్మవారి చెవులకు 'తాళీదళా బద్ధ తాటంకా' అని చెప్పారు. తాళీదళము అంటే తాటి కమ్మలు. వీటినే తెలుగులో చెవికమ్మలు అంటారు. అత్యంత పూర్వకాలంలో చెవికమ్మలుగా ఈ తాటి ఆకులను పెట్టేవారు. చెవికమ్మలు, తాళిబొట్టు మంగళకర వస్తువులు. వీటిని పూర్వకాలంలో తాటికమ్మల తోనే చేసేవారు. అందుచేతనే మంగళ సూత్రాలకు తాళిబొట్టు అనే పేరు ఏర్పడింది. అమ్మవారి చెవులకు తాటికమ్మల తాటంకాలతో పాటు ముత్యాల తాటంకాలు కూడా వేలాడు తున్నాయి. బ్రహ్మానంద పారవశ్యముతో మితిమీరిన విలాసముతో ప్రకాశిస్తున్న అమ్మవారి నేత్రములు, వాటిని పట్టుకుని వేలాడుతున్నట్టు అటుఇటు ఉన్న చెవులు. అమ్మవారి నాసిక చివరి మధ్యలో బులాకీ ముత్యం వేలాడుతోంది. 'నాసామౌక్తికం' అంటే అర్థం ఇదే. ఇంక అమ్మవారి వదనంలో మందహాసం ఎలా ఉందంటే నోట్లో తాంబూలం పెట్టుకొని నవ్వుతూ ఉన్నారు. ఆ తాంబూల పరిమళం దిగంతాలలో వ్యాపించింది అని చెప్పడంలో అర్థం కీర్తి స్వరూపమైన విద్యలు ప్రసాదించే తల్లి అని భావం. తెల్లని చిరునవ్వు తరంగంతో కూడిన ఎర్రని పెదవులు కల తల్లి. ఇంకా అమ్మవారి కంఠం శంఖంలా ఉంది అన్నారు. అమ్మవారి యొక్క సౌందర్య మనే సముద్రంలోంచి పుట్టిన శంఖమా అన్నట్లు ఉంది ఆమె కంఠం. సంగీతం లో ఉన్న ప్రధానమైన షడ్జ గ్రామ, మధ్యమ గ్రామ, గాంధార గ్రామములతో కూడిన సంగీతవిద్య ఆ కంఠంలో ఉన్నదా అన్నట్టు మూడు గీతలు ఉన్నాయి. అది ఉత్తమ సాముద్రిక లక్షణంతో ఉన్న లక్షణం. ఆవిడ కంఠం ఆ విధంగా ఉందని వర్ణించారు కాళిదాసు మహాకవి.
Sri Shyamala Devi Aabharanalu
అమ్మవారిది అలంకారాలకే అలంకారం ఇచ్చే స్వరూపం. ఆ తల్లికి ఉన్న ఎనిమిది చేతులకు 'ఛన్నవీరము' మొదలుకొని భుజకీర్తులు, కేయూరములు, కంకణములు,అంగుళీయకములు ఇలాఎన్నోఅలంకారములు మెరిసి పోతున్నాయి. అమ్మవారి చేతులు కల్పలతలు
మంచి రత్నాలు పొదిగిన బంగారు గాజులు అమ్మవారి ఎనిమిది చేతుల నుండి ఎనిమిది దిక్కులకి కాంతులను వెదజల్లుతున్నాయి. అమ్మవారి శరీరం అంతా నీలంగా ఉన్నా అరచేతులు ఎర్రగా ఉన్నాయి. వాటికి గోరింట మరింత శోభను కలిగిస్తున్నాది. అమ్మవారి చేతివేళ్ళు అన్నింటికీ రత్నాలు పొదిగిన ఉంగరాలు ప్రకాశిస్తున్నాయి. జ్ఞాన స్వరూపిణి యైన అమ్మవారు సత్త్వగుణ సంకేతాలైన ముత్యాలమాలలు ధరించింది. సర్వ జగతికి అమృత తుల్యమైన ప్రాణశక్తిని ప్రసాదిస్తున్న వక్షస్థలంతో కూడిన తల్లి.
అమ్మవారు నడుమున మేఖల అంటే వడ్డాణం ధరించింది. అది ఎలా ఉన్నది అంటే - 'రణత్కికింణి మేఖలా' అన్నారు వశిన్యాది వాగ్దేవతలు. 'క్వణత్కాంచీదామా' అంటూ శంకర భగవత్పాదులు వర్ణించారు. 'చారుశింజితా' అంటూ పరవశించి పలికేరు కాళిదాసు. కాదివిద్యా అని చెప్పబడే శ్రీవిద్యా మంత్రంలో ధ్వనించే నాదప్రకంపనలు ఏవైతే ఉన్నాయో ఆ నాద ప్రకంపనలే అమ్మవారి మొల నూలుగాచెప్పబడుతోంది. ఉన్నతమైన నితంబముఎర్రని వస్త్రముతో చుట్టబడి ఉన్నదిి. ఎఱ్ఱని వస్త్రము పైన కెంపులు పొదిగిన వడ్డాణముతో ప్రకాశిస్తున్న తల్లీ నీకు నమస్కారము.
Sri Shyamala Devi Padalu
అందముగా విలాసముగా నడిచే ఓ తల్లీ! అందరికీ దిక్కైన నీ పాదాలకు నమస్కారము. అమ్మవారి రెండు పాదాల్లో ఉన్న ఒక్కొక్క గోరు, చిన్న చంద్రఖండంలా కనపడుతోంది. మొత్తం చక్కగా తీర్చిదిద్దిన పది గోళ్ళు కూడా చంద్రుని ముక్కలలా కనపడుతుంటే అంతా కలిపి చంద్రబింబం లా ఉంది. పాదాలు చంద్రబింబం లా ఉంటే పాదాలకి నమస్కరిస్తున్న దేవకాంతల యొక్క శిరస్సులపై ఉన్న కేశాలు గరికల్లా పడుతుంటే, చంద్రమండలం లోంచి ఆ మృగం (చంద్రునిలోని లేడి)బయటికి వచ్చి గరికలనే అనుమానంతో దేవకాంతల కేశాలను చూస్తున్నట్లు అనిపిస్తోంది అంటున్నారు. ఏకకాలంలో అమ్మవారి పాదాలను, ఆ పాదాలకున్న గోళ్ళ కాంతులను చూపిస్తున్నారు. అమ్మా! ఆ గోళ్ళ కాంతులు దేవతల శిరస్సుపై కాదమ్మా ! నా నెత్తిపై ప్రకాశించాలి. ఎందుకంటే నా నెత్తినంతా అజ్ఞానమనే చీకటి ఉంది. అది పోవాలంటే తల్లీ! ఒక్కసారి ఆ పాదాలు నా తలపై పెట్టమ్మా! నా తలలో ఉన్న జన్మ,జన్మల అజ్ఞానము పటాపంచలు చేసే శక్తి నీ కాలికొనగోళ్ళ నెలవంకలకు ఉన్నదమ్మా! గొప్ప ప్రకాశము గల తల్లీ ! ఆ అమ్మవారి పాదాలకు నమస్కరించడానికి నేనంటే నేనని గుంపులు కట్టేశారుట. ఎవరు?
సమస్త దేవతలు, దేవతలకి ఈశ్వరుడు అంటే ఇంద్ర, యమ, వరుణ ఇత్యాది దిక్పాలకులు. ఉత్తములైన దైత్యులు, యక్షప్రభువులు, దివ్య శక్తుల భూతప్రభువులు ( భూతాలు అంటే కంటికి కనపడని దివ్య శక్తులు) కోణేశ కోణములు అంటే విదిశలు.అంటే ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య, నైరుతి. కోణేశ అంటే వాయువు, అగ్ని మొదలైనవారు. వీరంతా అమ్మవారికి నమస్కారము చేస్తుంటే, ఆ కిరీటాలకు ఉన్న రత్నాలకాంతులు అమ్మవారి పాదాలమీద పడుతున్నాయి. అరికాళ్ళు పద్మాలలా ఉన్నాయి. అటువంటి ఆ పాదాలకు లాక్షారసం రాసుకుంది అమ్మవారు. లాక్షారసం అంటే పారాణి. పద్మం లో లక్ష్మీదేవి ఉంటుంది కనుక అమ్మవారి పాదపద్మంలో లక్ష్మీ దేవి ఉన్నది. అటువంటి రెండు పాదాలతో ఉన్నతల్లి , తనకు రెండవది అంటూ లేని తల్లిగా అంటే తనకు సాటి మరొకరు లేని తల్లి మనస్సులో స్థిరంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు కాళిదాస మహాకవి.
Sri Shyamala Devi Vaibhavam
అమ్మవారు నవరత్నములు పొదిగిన స్వర్ణ పీఠము పై కూర్చుని ఉంది. ఆ కూర్చోవటం నిండుగా కూర్చుంది ( ఎప్పుడు లేచిపోదామా అన్నట్లు కాదు) అమ్మని ధ్యానించేటప్పుడు తొందరపడకూడదు. ఆవిడ మన హృదయంలో ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. ఇక్కడ నుంచి అమ్మవారి యంత్రాలలో ఉన్న దేవతలు ఏ ఆవరణలో ఏ దేవత ఉన్నారో కాళిదాసు వర్ణిస్తున్నారు. నిధి దేవతలు అని కొందరు ఉంటారు. వీరు మహాలక్ష్మి అనుగ్రహంతో ఉంటారు. వీరిని అమ్మవారు కుబేరునికి ఇచ్చింది. శ్యామలాదేవిని ఉపాసిస్తే జ్ఞానం మాత్రమే కాదు, సంపదలు కూడా ఇస్తుంది. మొత్తం ఏడు ఆవరణల చక్రం లో బిందువు మొదటి ఆవరణ అనుకుంటే చివరకు చతురస్రం వస్తుంది. ఆ చతురస్రం ఏడవ ఆవరణ అవుతుంది. అది ఆఖరదిి. మన నుంచి చూస్తే అది మొదటిది. శ్యామలాదేవి దగ్గరకు వెళ్ళాలంటే బిందువు లోకి వెళ్ళాలి. అక్కడ క్రింది భాగంలో లక్ష్మి, సరస్వతి, శంఖ, పద్మ అనే నలుగురు దేవతలు ఉంటారు. క్షేత్రపాలకుడు, దుర్గాదేవి, వటుకుడు అనే దేవతలతో కొలువైన తల్లి. వీరంతా శ్యామలా దేవి పరివారం. శ్యామలా భక్తులను వీరు అనుగ్రహిస్తూ ఉంటారు. ఐదుగురు మాతంగ కన్యలతో అమ్మవారు సేవింపబడు తున్నారు. ఎనిమిది మంది భైరవుల చేత ( ఎనిమిది దిక్కులకు ) సేవించబడు తున్న తల్లి. అమ్మవారిని కొలుచుకుంటూ ఉన్న శక్తులు పదహారు మంది. మరో విశేషం - పై భాగంలో ఉన్న ఎనిమిది శక్తులను చెప్తూ మొత్తం మాతృకా మండలం అక్కడే ఉంటుంది అని చెప్తున్నారు. సప్త మాతృకలు , లక్ష్మాది శక్తులు వీరితో అమ్మ సేవింప బడుతున్నది.
పంచబాణశక్తులచేత, రతీదేవి చేత సేవింప బడుచున్నది. పంచబాణశక్తులు అంటే మన్మధుని ఐదు బాణాలు. వీరితోపాటు ఐదుగురు పురుషదేవతలు ఉంటారు. శ్యామలా దండకమే ఒక మంత్రరాశి.
Copyrights 2011. All Rights Reserved Sanskrutionline.com