|
1. శ్రీరాముని పట్టాభిషేక విషయం దశరథుడు కైకకు ముందుగా ఎందుకు చెప్పలేదు ?
మంథర ద్వారా తెలిసే వరకూ చెప్పలేదంటే కారణం ?
2. తన మామగారికి ( కైక తండ్రి) ఎందుకు చెప్పలేదు?
3. అసలు శ్రీరాముని మామ గారికి సైతం ఎందుకు చెప్పలేదు ?
4. తన స్వంత పిల్లలు భరత శత్రుఘ్నులకు కూడా రమ్మని కబురు పంప లేదే ?
5. శ్రీరాముని తల్లి కౌసల్య - రాముని పట్టాభిషేక వార్త విని తన దాసీ జనానికి కానుకలు ఇచ్చింది, మరి అంతటి ధర్మాత్మురాలు కదా కైక దాసీ జనానికి ఎందుకు ఇవ్వలేదు ? ఇలాంటివే ఎన్నో ప్రశ్నలు కారణాలు చూద్దాం -
తనకు దుస్వప్నాలు వస్తున్నాయని, వీటి అర్థం రాజుకు మృత్యువైనా రావచ్చు, లేదా ఆపదైనా సంభవించవచ్చును. కనుక శ్రీరాముని పట్టాభిషేకం త్వరగా జరిగిపోవాలని దశరథుని ఆరాటం.
దశరథుడు కేకయ రాజుని ( తన మామ గారిని ) పిలువక పోవటానికి కారణం కైకేయితో తన వివాహ సందర్భమున కేకయ మహారాజుకు మాట ఇచ్చేడు, కైకకు జన్మించిన కుమారునే యువరాజుని చేస్తానని. అలా జరగడం లేదు కదా ! అందుకే మరి పిలువలేదు. బంధువుల్లో కేకయ రాజుని పిలువ కుండా జనకుని పిలవటం బాగుండదని మిధిలానగర రాజుని పిలువలేదు. ఇక తాతగారింట్లోనేఉన్న భరతశత్రుఘ్నులను ఎలా పిలువగలడు? వేరే కారణం చెప్పి పిలిపించవచ్చు. కాని తన మనసులో భరతునిపై ఇంకా చెప్పాలంటే తనపై కూడా తనకు మనసులు మారిపోతాయేమోనన్న అనుమానం ఉంది.
కైకకు ముందుగా చెప్పక పోవటానికి కారణం యుద్ధంలో తనను రక్షించిందని రెండు వరాలు ఇచ్చేడుకదా ! మనసులో ఏ మూలో భయం దాగివుంది. పుణ్యాత్ములకు, సచ్చరిత్రులకు రాబోయే పరిణామాలు ముందుగా కలవరపెడతాయి. ఏదోవిధంగా రాముని పట్టాభిషేకము జరిగిపోవాలి, తరువాతి సంగతి తరువాత చూసుకోవచ్చు ఇదీ దశరథుని అంతర్మథనం.
అయితే కేకయ మహారాజుకు మాట ఇస్తే మరి ఇప్పుడు మాట తప్పినట్టు కాదా? అసత్య దోషం రాదా ? ఆ భయం కూడా ఉంది. ఐతే కౌసల్య జ్యేష్ట పట్టపు రాణి. పట్టపు రాణి తాలూకు జ్యేష్ట పుత్రుడే రాజు కావాల్సి ఉంటుందని ధర్మశాస్త్రం చెబుతోంది. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం రాముడే యువరాజు. ఆ చిన్న అడ్డు పెట్టుకొని దశరథుడు రాముని పట్టాభిషేకము చెయ్యాలను కుంటాడు. కానీ ధర్మం కొన్ని కాలాల్లో మారవచ్చు, ధర్మానికి మించింది సత్యం. సత్యం అన్ని కాలాల్లోను ఒక్కలాగే ఉంటుంది. ఈ సత్యాన్ని పట్టుకొనే కైక వరాలడిగింది.
భరద్వాజ మహర్షి భరతునకు అంత గొప్ప విందు ఎందుకు ఇచ్చినట్లు ?
భరద్వాజుడు భరతునకు, సైన్యానికి ఇచ్చిన విందు గురించి వాల్మీకి మహర్షి 84 శ్లోకాలు గల ఒక సర్గ నే కేటాయించాడు. ఎందుకంటే భరతుని త్యాగనిరతికి పరవశించి.
ఒక ముని ఆశ్రమంలో అంత గొప్ప విందు ఎలా ఇవ్వగలిగే డు?
భరద్వాజుడు ముందుగా అగ్ని శాలలో ప్రవేశించి , ఆచమనం చేసి విశ్వకర్మను, ఇంద్రుని, యముని, వరుణుని, కుబేరాదులను ఆహ్వానించాడు. అతిథి ఏర్పాట్లు చేయమని కోరాడు. అనేకమంది దేవతలు కలిసి కనీవినీ ఎరుగని రీతిలో విందు జరిపించారు. అంతేకాదు రాముని వనవాసము వల్ల భవిష్యత్తులో ఎంతో శుభము కలుగబోతోంది, కైకలో దోషము చూడకు నాయనా అని భరద్వాజుడు భరతుని తో పలుకుతాడు.
శ్రీరాముని తల్లి కౌసల్యాదేవి ధర్మాత్మురాలే! కాకపోతే లౌక్యం తెలియని మనిషి. అంతకు మించి ఆమె గురించి ఏమీ ఆలోచించలేము.
దశరథ మహారాజు, రాముడు అడవికి వెళ్ళిన ఆరవ రోజున మరణించినట్లు వాల్మీకి రామాయణం లోను, తులసీ రామాయణంలోను కూడా కలదు. పైగా ఆరు (6) సార్లు రామా అంటూమరణించాడు. అందుకు కారణాలు మహాత్ములు ఇలా చెప్తున్నారు.
1. రాముడు వనవాసానికి వెళ్ళి ఆరు రోజులైంది, అందుకని.
2. రాముడు షడ్గు్ణైశ్వర్య సంపన్నుడైన విష్ణు స్వరూపుడని.
3. రామ నామము షడ్దర్శనముల సమగ్ర స్వరూపమని.
4. రామనామం తో అరిషడ్వర్గాలు జయింపబడతాయని.
5. రామాయణము లోని ఆరు కాండలు రామ స్వరూపమేనని.
6. దశరథుని అవసాన కాలమున కౌసల్య, సుమిత్ర, సుమంత్రుడు ఈ ముగ్గురే ఉన్నారు వాళ్ళకు వీడ్కోలు ఇస్తూ రాం, రాం అంటూ కన్నులు మూసేడుట
. ఈ విధంగా అనేకమంది మహాత్ములు వారి వారి అనుభూతులు చెప్పేరు
అవతారములవైశిష్ట్యం
రెప్ప పాటు లేని చేప అఖండ కాలమునకు ప్రతీక అయిన జలమున ఈదుచుండును. ఇది మొట్టమొదటి దశ.
( ఇదియే మత్స్యావతారం ) .
తాబేలు నీటి నుండి వెలుపలికి వచ్చి తన నుండి కాళ్ళను బయటకు విప్పి నట్లుగా ప్రజ్ఞలు విచ్చుకొనుట రెండవ దశ.
( ఇదియే కూర్మావతారం ).
నీటి నుండి బురదగా ద్రవ్యమును వెలికి తీయుట మూడవ దశ.
సృష్టి యందు గోళములు కట్టుకొనుట అనెడి యజ్ఞమును ఈ దశయందే జరిగినది.
( ఇది వరాహావతారం )
సృష్టి యందు మొదట జన్మించిన జీవి అహంకార రూపుడై ఉండును.
జ్యోతిశ్శాస్త్రమున హృదయమును సూచించు నది సింహరాశి. మానవుని యందలి సింహ రూపమైన హృదయము నందలి అహంకారమును శ్రీహరి నరసింహ రూపుడై హిరణ్యకశిపుని వధించి ఆనందరూపుడైన ప్రహ్లాదుని రక్షించును.
( ఇదియే నరసింహావతారం ).
గోళముల నుండి గ్రహము లేర్పడుట కూడా ఈ దశ యందే జరిగినది. అహంకారము మరణించిన తర్వాత మిగులునది ఆత్మ సమర్పణ - దీనికి సూచనయే బలి కధ. మూడు అడుగులు అనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములు. మూడు అడుగులు అనగా సత్త్వ, రజస్తమస్సులనెడి త్రి గుణములు.
(ఇదియే వామనావతారం ).
బలి అనెడి బలమును పాతాళమునకు పంపివేయగా జ్ఞానము సర్వత్ర వ్యాప్తి చెందును.
మొదట రూపు దిద్దుకున్న మానవుడు సహజముగా రజో జీవి. ఈ రజస్సు విపరీతముగా నున్నప్పుడు ప్రతిదానిని వాంఛించుట, పొందలేనిచో బలవంతముగా లాగికొనుట, అడ్డు వచ్చినచో నరికివేయుట అనెడి తీవ్రస్వభావములు వ్యక్తమగును.
(ఇదియేపరశురామావతారం)
ఇరువది యొక్క మార్లు క్షత్రియులను హతమార్చుట యనగా మూడు లోకములు, ఏడు తలములుగా సప్త భూమికలను స్థాపించుట.
ఈ దశయందే సప్త వర్ణములు, సప్త గ్రహములు, సప్త లోకములు, సప్త కిరణములు, సప్త జాతులు గా ఒక స్పష్టమైన వర్గీకరణ ఈ దశ యందే జరిగినది.
మానవునిగా రూపు దాల్చిన మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి, జీవనశైలి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అభ్యుదయాన్ని సాధించాలి ఆదర్శవంతమైన జీవితాన్ని ఎలా లోకానికి నేర్పాలి ఆచరించి చూపించేడు రాముడు.
(ఇదియే రామావతారం)
(కృష్ణావతారం లీలావతారం)
ధర్మాన్ని అడుగడుగునా బోధించిన అవతారం.
|