Koluvu details
శ్రీ కామేశ్వరీ దేవి చలువ
అమ్మవారి భక్తులు కొందరు "కామేశ్వరీ దేవి చలువ" చేసుకోవటం అంటే ఏమిటి ? ఎలా చెయ్యాలి ? అని కోరటంతో "కామేశ్వరీ దేవి చలువ" చేసుకోవటం గురించి తెలుసుకుందాం
ముందుగా కామేశ్వరీ దేవి పెద్ద కొలువు చెయ్యటం అంటే ఏమిటో తెలుసుకుందాం.
కామేశ్వరీ దేవి కొలువు అంటే కామేశ్వరీ దేవి యొక్క సామ్రాజ్య పట్టాభిషేకము జరపడమే! అదియేకదా ఆమె పార్వతీపరమేశ్వరులను కోరింది. కులదేవతగా ఆధిపత్యాన్ని పార్వతీపరమేశ్వరులు ప్రసాదించగానే బ్రహ్మగారు వసంతోత్సవాన్ని జరిపించడం, అమ్మవారు సోదర సోదరీ సహితంగా "కులదేవత" గా, "కులేశ్వరి " గా భక్తులను అనుగ్రహించడం శక్తి పురాణం లో బ్రహ్మనారద సంవాదము గా ఉన్నాది. దాన్ని పురస్కరించుకుని మనం కొలువు జరుపుకుంటున్నాము.
కులదేవత గా అమ్మవారు ఉన్న ప్రతిఇంట శుభకార్యాల అనంతరం అమ్మవారి కొలువు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కొంతమంది తమ కోరిక తీరితే అమ్మవారి కొలువు చేసుకుంటామని మొక్కుకుంటారు. ఇంకొంతమంది సంవత్సరానికి ఒకసారి ముఖ్యంగా వైశాఖ మాసంలో చేసుకోవాలనే దీక్షతో చేసుకుంటారు.
అయితే వర్తమాన కాల పరిస్థితుల కారణంగా కొలువు జరుపుకో లేనివారు ఏమి చెయ్యాలి? అందుకు మన పూర్వీకులు చిన్న సదుపాయం కల్పించారు. అలాంటి వారికోసం "అమ్మవారిచలువ"
(లేదా ముంతచల్ల అని కూడా అంటారు) అని తమ గృహం లోనే సంక్షిప్తంగా చేసుకొనే పద్ధతి తెలిపేరు.
పూజా మందిరంలో కలశ ప్రతిష్ట చేసి కలశములో నీరు, కొద్దిగా పానకము గంధ పుష్పాక్షతలు వేసి మామిడి కొమ్మను ఉంచి కొబ్బరికాయ, జాకట్టుబట్టనుంచి తమలపాకు లో మంచిగంధముతో శ్రీ కామేశ్వరీ దేవి ప్రతిగా ఆవాహన చేసి శ్రీ సూక్త ప్రకారము షోడశోపచార పూజ ,అవకాశమున్నచో లలితా సహస్ర నామములతో చేసుకొందురు. పూజ అనంతరము ముగ్గురు ముత్తైదువులకు పాదాలకు పారాణి రాసి ,గంధం, బొట్టు వగైరా సువాసినీ పూజ చేసి ( పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, తాంబూలం సమర్పించి అవకాశమున్నచో చీర,జాకెట్టు బట్ట ) చలిమిడి వడపప్పు, పానకము ఇచ్చి పాదాలకు నమస్కరించెదరు. వీలున్నవారు భోజనము కూడా పెట్టి పంపిచెదరు. ఇదంతయు మన శక్తి ని బట్టి ఉంటుంది.
అమ్మవారి కొలువు ఐనా చలువ ఐనా ఆదివారము, లక్ష్మివారము జరుపుకొనుట శ్రేష్టము. మంగళవారము, శనివారము కాకుండా మీ సదుపాయాన్ని బట్టి చేసుకొనవచ్చును. ఇలా చేసుకోగా కొన్నాళ్ళకు అమ్మవారే పెద్ద కొలువు చేసుకొనగలిగే అవకాశాన్ని అనుగ్రహిస్తుంది.
నమస్కారములతో
ఆకుండి శకుంతల
శ్రీ కామేశ్వరీ దేవి కొలువుకు ముందుగా సిద్ధం చేసుకొనవలసినవి
1. సన్నాయి మేళం. ( దొరకనిచో మనవద్ద వున్న రికార్డ్ ప్లే చేసుకోవచ్చు. అది కూడా లభ్యం కానిచో అందరూ కలిసి శ్రీ సూక్త పారాయణ చేస్తూ గుడికి వెళ్ళవచ్చును )
2. ఉల్లభము, కర్ర. ( ఇది కొలువు మండపము నందు కలదు )
3. పూజా సామాగ్రి ( ఇదియు అందరకూ తెలిసినదే )
4. అక్కలు (7) పేరంటాడ్రు (6) తమ్ములు (2)
5. వారికి ఇవ్వవలసిన చిక్కసం సామగ్రి ( సామగ్రి గురించి పూజ చేసుకొనే విధానములో చెప్పితిమి).
6. శృంగారం ముగ్గు కు కావలసిన రంగులు ( ఇది కూడా కలదు)
7. సువాసినులకు ఇవ్వవలసిన తాంబూలం సామగ్రి.
8. చలిమిడి, వడపప్పు, పానకము. ( వీటి కొలతలు వారి ఇంటి సాంప్రదాయము ననుసరించి ఉంటుంది. తెలియనిచో 5 గ్లాసుల బియ్యం
9. పాలకొలను కొరకు కొత్త ఇత్తడి పళ్ళెం.
10. ఆవుపాలు కనీసం 1 లీటరు.
11. శృంగారం ముగ్గు తుడచుటకు కొత్త బట్ట ( లేదా చీర).
12. గురువు గారికి మండపదాన దక్షిణ, వస్త్ర తాంబూలం వగైరా.
గమనిక ::::::: ఇచ్చట బంధు వర్గము లోని స్త్రీలకు కూడా శక్తి కొలది సువాసినీ పూజలో పెట్టినట్టుగా అన్నీ పెట్టి తాంబూలం ఇవ్వవచ్చును.
అక్కలు పేరంటాండ్రుల భోజనం అయిపోయాక పూజ చేసుకొను వారే శుభ్రపరచవలెను.
శ్రీ శ్రీ శ్రీ కామేశ్వరీ దేవి కొలువు చేసుకొనే విధానమ
[Part 1]
సూర్యోదయానికి పూర్వమే కొలువు కొలుచుకునే గృహస్తులు స్నానాదులు ముగించుకొని అమ్మవారిని పిలచుటకై సిద్ధముగా ఉండవలెను. అమ్మవారి పూజకు పసుపు, కుంకుమ అక్షతలు, పువ్వులు, పండ్లు వగైరా సిద్ధము చేసుకొని , పూర్ణ కలశమును కూడా సిద్ధపరచు కొనవలెను. ( కలశమునకు పసుపురాసి, కుంకుమ బొట్లు పెట్టి, కలశములో శుద్ధ జలమును పోసి గంధమువేసి మామిడి చిగుళ్ళు పెట్టి కలశమును సిద్ధము చేసుకోవలెను.)
చక్కని సన్నాయి మేళముతో ఉల్లభము క్రిందుగా పూజ చేసుకొను దంపతులు నడువవలెను.అమ్మవారి గుడికి చేరుకోగానే కాళ్ళు కడుక్కుని అమ్మవారి ముందు కలశము నుంచి పూజ చేయించు కొనవలెను.( పూజారి అంత త్వరగా రాలేక పోయినచో దంపతులే అమ్మవారి నిత్యపూజ చేసుకొనవచ్చును) పూజ హారతి అయిన తరువాత అమ్మవారిని యీ విధంగా పిలువవలెను
" అమ్మా! మాఇంటి కులదేవత వైన కామేశ్వరీ దేవీ! యీ రోజు మేము నిన్ను కొలుచుకొను సంకల్పము చేసుకున్నాము. మా ఇంటికిి నీ పరివారముతో రావలసినదిగా కోరుచున్నాము. నీ అక్కలతో, తమ్ముళ్ళతో, ముక్కోటి దేవతలతో, నందినాగన్నలతో నారదాది మునులతో సపరివారంగా విచ్చేసి మా పూజలందుకొని, మమ్ములను అనుగ్రహించి ఆశీర్వదించ వలసినదిగా" అభ్యర్ధించ వలెను.అపరాధములను క్షమించమని వేడుకొనవలెను. అమ్మవారిని తోడ్కొని తిరిగి అదే విధంగా ఉల్లభము క్రిందుగా నడిచి కొలువు కొలుచుకొను మండపమునకు రావలయును.
అచ్చట ముత్తైదువులు అమ్మవారికి, పూజ చేసుకొను దంపతులకు హారతి ఇవ్వగా పూజామందిరము నకు వచ్చి కలశమును పూజా మండపమున ఉంచ వలయును. పూజా గదిని, మందిరమును,చక్కగా అలంకరించు కొనవలెను. మండపమును పురోహితులు సిద్ధము చేసెదరు. మండపము పై అమ్మవారి ఫొటోను పెట్టి పువ్వులు,దండలు తో అలంకరించి, ఫొటోముందు, అమ్మవారి గుడి నుండి తీసుకొని వచ్చిన కలశము నుంచి అందులో కొంచెం పానకము పోసి కొబ్బరికాయ జాకట్టుబట్టనుంచి అమ్మవారి ప్రతి రూపముగా మంచిగంధమును
తమలపాకు లోఉంచి కలశము మీదగాని, కలశమునకు ముందుగా గాని ఉంచవలెను."
[Part 2]
శ్రీ కామేశ్వరీ దేవి అక్కలుగా ఏడుగురుని, పేరంటాండ్రుగా ఆరుగురుని, ( ఇచ్చట వారి ఇంటి సాంప్రదాయము ననుసరించి లెక్క వేసుకొన వచ్చును) పోతన్న, వీరభద్రులుగా ఇరువురు పురుషులను పిలువవలెను.
( పిలిచే విధానం) ఎలాగంటే: ప్రతి ఒక్కరికీ పసుపు, కుంకుమ, నలుగుపిండి, కుంకుడు కాయలు ( అవి లభ్యం కానిచో షాంపూ పేకట్లు ), కొంచెం కొబ్బరినూనె ( పూర్వకాలం " చిక్కసం " పంచడం అనేవారు ) ఇవన్నీ ఇస్తూ బొట్టు పెట్టి ఒక్కొక్కరికీ అందిస్తూ " యీ రోజు మేము
శ్రీ కామేశ్వరీ దేవి కొలువు కొలుచుకొనుచున్నాము, కాబట్టి మీరు కామేశ్వరీ దేవి అక్కగా మా ఇంటికి రావలసినది అని 7గురు ముత్తైదువులను పిలవాలి. అలాగే పేరంటాండ్రను కూడా మీరు కామేశ్వరీ దేవి పేరంటాలు ( పరివారము) గా రమ్మని పిలువవలెను. ఇరువురు మగవారిని కామేశ్వరీ దేవి తమ్ములుగా రమ్మని పిలువవలెను.
మిగిలిన బంధువులను, ఊళ్ళోవాళ్ళను పూజ చూడటానికి, భోజనమునకు తప్పక రావలయునని చెప్పి పిలువవలెను.
వచ్చిన స్త్రీలందరకూ కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టవలెను. కుంకుమ బొట్టు పెట్టి గంధము మెడకు పూయవలెను.
[Part 3]
పూజా మండపము నకు తూర్పు దిశగా లేదా ఉత్తర దిశగా అమ్మవారి "శృంగారం ముగ్గు" పంచ రంగులలో క్రింద చూపించిన విధంగా వేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి.
అమ్మవారి నైవేద్యం కొరకు చలిమిడి, వడపప్పు, పానకము తయారు చేసి సిద్ధము చేసుకోవాలి.
తరువాత పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి. పుస్తకం లో ఉన్న విధముగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి మండపారాధన,నవగ్రహారాధన పంచలోకపాలకుల ఆవాహన, అష్టదిక్పాలుర ఆవాహన చేసు కుని శ్రీమహాకామేశ్వరీదేవిని శ్రీ సూక్త ప్రకారంగా షోడశోపచార పూజ లలితా సహస్రనామము లతో శ్రద్ధగా చేసుకొన వలెను. ఇంకనూ ఆసక్తికలవారు దేవీ ఖడ్గమాల, దేవీ త్రిశతీ పారా యణ కూడా చేసుకున్నచో మరింత శ్రేష్టము. అమ్మవారికి ఇష్టమైన చలిమిడి, వడపప్పు, పానకము నివేదించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతి,మంత్రపుష్పంఅయిన తరువాత కామేశ్వరీ దేవి కొలను పాట ఉంటుంది..
[Part 4]
ముందుగా వేసుకుని ఉంచుకున్న శృంగారం ముగ్గు పై కొత్త ఇత్తడి పళ్ళెంలో ఆవుపాలు పోసి ఆ పాలలో ఒక బంగారు గొలుసు నుంచి కొలువు చేసుకొను కుటుంబము వారు చుట్టూ కూర్చొని ఆ బంగారు గొలుసు ను సవ్యముగా త్రిప్పుతూ కామేశ్వరీ దేవి తన అక్కలతో పాలకొలనులో జలకము లాడుచున్నట్లు భావన చేస్తూ కొలను పాట పాడుకోవలెను. పాట పూర్తయిన తరువాత "కామేశ్వరీ దేవి పాదోదకం పావనం శుభం" అంటూ భక్తులపై పాలను జల్లవలయును. మిగిలిన పాలను సూర్యాస్తమయము కాక పూర్వమే పచ్చని చెట్టులో పోయవలెను. శృంగారం ముగ్గు ను కొత్త చీరతో( బట్ట) తుడిచి ఆ పిండిని కూడా చెట్టు మొదటి ఉంచవలెను.
పూజా చేయించిన బ్రాహ్మణునకు మండపదానం చేసి భోజనం పెట్టిన వస్త్ర తాంబూలాలు సమర్పింప వలెను.
[Part 5]
ఇప్పుడు కామేశ్వరీ అక్కలుగా పిలిచినవారి పేర్లు వారికి చెప్పండి. ( కామేశ్వరీ అక్కలుగా మీకు వీలయినంత వరకు మీ ఇంటి పేరున్న ఆడపడచులనే పిలవండి. వీలు కానిచో మిగిలిన వారిని పిలవండి) అక్కలపేర్లు వరుసగా
1. రశికాంబిక,
2. చీర్వాణి,
3. పేర్వాణి,
4. జక్కులాంబ,
5.ఎన్నికాంబిక,
6. ముగ్థ,
7. కొండవాణి. ఈ విధముగ వారిని వరుసగా కూర్చో పెట్టి ఆ తరువాత పేరంటాండ్రను కూడా కూర్చో పెట్టి బొట్టుపెట్టి, గంధం పూసి ( పూజకు వచ్చే స్త్రీలందరకూ ఉదయమే కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టవలెను.) సువాసినీ పూజ చేయవలెను.
(అదే: పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, దక్షిణ, తాంబూలం, నల్లపూసలు, గాజులు, జాకెట్టు బట్ట ఉన్నవారు చీర మొదలైనవి) సోదరులిద్దరకూ బొట్టు పెట్టి గంధము రాసి పంచ,కండువా దక్షిణ, పండ్లు, తాంబూలం పెట్టి పూజించవలెను. తరువాత ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న చలిమిడి, వడపప్పు, పానకము ఒక్కొక్కరికీ అందించ వలెను. అమ్మవారికి శ్రద్ధగా దండం పెట్టు కొని అక్కలకూ, పేరంటాండ్రకూ, సోదరులకూ పాద నమస్కారం చేసుకొని వారి వద్ద నుంచి కొంచెం ప్రసాదం ఇవ్వవలసిందిగా దండుకోవలెను. ( దండుకోవడము అనగా అర్థించడము)
పంచెకొంగు పట్టి దంపతు లిరువురూ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి " అమ్మా! కామేశ్వరీదేవి ప్రసాదం కొంచెం పెట్టండమ్మా అని అర్థించాలి. వారిచ్చిన ప్రసాదం మీరు, మీ కుటుంబ సభ్యులు మాత్రమేఆరగించాలి. నిరాదరణ చేయకూడదు. ( ఒకవేళఎక్కువైనచో గోమాతకు పెట్టవచ్చును)
తరువాత అక్కలకు, పేరంటాండ్రకు, సోదరులకు ముందుగా భోజనము వడ్డించవలెను. వారు భోజనం ప్రారంభించిన పిదప మిగతా బంధువులకు భోజనము పెట్టవలెను.
ఇదియే శ్రీ కామేశ్వరీ దేవి కొలువు కొలుచుకొనే వ్రత విధానము.
|